సుబ్బలక్ష్మిగారి కలం నుంచి

!! వినాయక చవితి శుభాకాక్షలు !!

Aug 29 2014

 

 

 

రామాయణంలో....

"మానిషాద ప్రతిష్ఠాంత్వమ్ అగమశ్శాశ్వతీ సమాః |
యత్క్రౌంచమిథునాదేకం అవధీః కామమోహితః "||

ఈ శ్లోకానికి భాష్యం అప్పలాచర్యులగారు చెప్పిన మూడవది తత్వార్థము:
ఆయన చెప్పిన తత్వార్థము ఆత్మ కథ !

ఆయన చెప్పిన తత్వార్థము చదివే ముందర కొంచెము అత్మ అన్న విషయము గురించి ఆలోచిద్దాము !!.

మనము ఆత్మ పరమాత్మల గురించి రెండే విషయాలు గుర్తుంచుకుందాము.

ఒకటి ఆత్మ పరమాత్మలకలయికే మోక్షమనబడుతుంది.

రెండవది ఆత్మకి తన శక్తి తనకే తెలియక తమో రజో గుణముల అధీనములోతప్పుదారులలో పోవడము , చివరికి ఆత్మ తనంత తానే తమో రజోగుణములను అంటే కోరికలను అధిగమించి నప్పుడు సత్వ గుణ ప్రధానం అవుతుంది. ఆత్మలో అంటే మనలో సత్వగుణము ప్రధానమైనప్పుడు ఆత్మకి తన శక్తి తెలుస్తుంది .

అప్పుడే ఆత్మ పరమాత్మల కలయిక - మోక్షము !

దీనిని ఇంకొంచెము విశదీకరిద్దాము !

ఆత్మకి తనలోనే పరబ్రహ్మత్వముందని తెలియక - రజో తమో గుణములకు లొంగి మనస్సు అనేక బాహ్యమైన కోరికలపైకి పోతుంది. ఆ కోరికలను అధిగమించి అంటే త్యజించి లేక వదిలేసి నప్పుడు ఆత్మ నిర్మలత్వము పొందుతుంది.

అది నిజం .

కోరికలులేనప్పుడు మన మనస్సులోని నిర్మలత్వము మనకే తెలుస్తుంది.

ఆత్మ నిర్మలత్వను పొందటమే సత్వగుణ ప్రధానమవడము అన్నమాట.

ఆత్మలో సత్వగుణప్రధానమైనప్పుడు స్వార్థభావము పోయి పరార్థభావము ఏర్పడుతుంది. అంటే తన స్వార్థము కోసము కాకుండా పరులు అంటే ఇతరుల స్వార్థము కోసము పనిచేస్తుంది అన్నమాట !

పరార్థములోనే పరమాత్మ కనిపిస్తుంది ఆత్మకి.

ఆత్మ పరమాత్మల ఏకత్వము అంటే కలయికే మోక్షము !

ఈ ఆత్మ పరమాత్మల కథ రామాయణములో ఎలా చెపుతారు అన్నది - భాష్యం అప్పలాచార్యులవారి చెప్పినది.

శరీరము లంక .

జీవుడు మనస్సుచేత శరీరములో బంధింపబడతాడు. మనస్సుతో సంబంధముకలుగగానే పరిశుద్ధమైన ఆత్మ కూడా కలుషితమౌతుంది. అంటే ఆత్మ అల్పత్వము కలది అగుతుంది. ఆల్పత్వము అంతే ప్రకృతి సహజమైన గుణములు వస్తాయి . ప్రకృతి సహజమైన గుణములు మూడు అవి సత్వము రజస్సు తమస్సు అనుబడునవి . తమో గుణము మోహము. రజో గుణము మనస్సు చంచలత్వము , సత్వగుణము ప్రకాశత్వము కలిగిస్తాయి.

లంక అనెడి శరీరములో తమో రజో సత్వ గుణ సంబంధులైన ముగ్గురు సోదరులు రావణ కుంభకర్ణ విభీషణులు వున్నారు.

రావణుడు రజోగుణము , కుంభకర్ణుడు తమోగుణము , విభీషణుడు సత్వగుణము తో సమానులు.

ఈ ప్రకృతి సహజమైన ఈ మూడు గుణములు ఆత్మని బంధించి , ఆత్మని పరమాత్మకి దూరము చేస్తాయి. ఆత్మ ఈ మూడు గుణములను అధిగమించి నప్పుడే బ్రహ్మ సాక్షాత్కారము అంటే పరబ్రహ్మముతో కలవడము అవుతుంది.

శ్రీరాముడు భగవత్స్వరూపము. శ్రీరాముడు తామస రజోగుణ సంబంధులైన కుంభకర్ణ రావణులను వధించి సత్వగుణ ప్రధానుడైన విభీషణుని పట్టాభిషేకముచేసి లంక అనెడి శరీరములో సత్వగుణానికి రాజ్యము ఇస్తాడు .

సత్వగుణ ప్రధానము అయినప్పుడు ఆత్మ పరమాత్మకు దగ్గర అవుతుంది.

ఈ లంకా కథలో రావణ కుంభకర్ణుల వధతో ఆత్మతో సమానమైన సీతాదేవిని బంధములోనించి బయటికి తీసుకురావడము , సీతారాముల సంగమము శ్రీరామ పట్టాభిషేకము ఆత్మ పరమాత్మల కలయికని నిరూపించినట్లు .

ఇదియే రామాయణములో ఉపనిషార్థము .

దీనినే రామాయణములో తత్వార్థము అని గూడా అంటారు.

ఇది మానిషాద .. శ్లోకములోని మూడవ తత్వార్థము

!! ఓమ్ తత్ సత్ !!